అమరులైన ఐదుగురు వీరులు

తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.. ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న పౌరులను క్షేమంగా విడిపించి చివరికి అమరులయ్యారు ఐదుగురు భద్రతా సిబ్బంది. విధి నిర్వహణలో వీరు చూపిన ధైర్య సాహసాలను చూసి దేశమంతా సెల్యూట్‌ చేసింది. ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉన్న హంద్వారా ప్రాంతంలో లష్కరే తాయిబా సంస్థకు చెందిన ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు గురువారం బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదులకు, బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఉగ్రవాదులు తప్పించుకున్నారు. ఆయితే అదే సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఛాంగిముల్లా గ్రామంలోని ఓ ఇంట్లో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు సమాచారం అందించాయి. దీంతో కర్నల్‌ అశుతోష్‌ శర్మ తన బృందంతోపాటు ఎస్‌ఐ షకీల్‌ అహ్మద్‌ ఖ్వాజీతో కలిసి ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టారు. ఉగ్రవాదులు 11 మంది పౌరులను బందీగా పట్టుకొని వారి ఇంట్లోనే తలదాచుకున్నట్లు బలగాలు గుర్తించాయి. దీంతో ఇంటి పక్కనే ఉన్న పశువుల పాకలోనికి బలగాలు వెళ్తుండగా గుర్తించిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ సందర్భంగానే పౌరులకు ఉగ్రవాదుల చెర నుంచి విముక్తి లభించింది. కానీ దురదృష్టవశాత్తూ కాల్పుల్లో సైన్యానికి చెందిన కర్నల్‌ అశుతోష్‌ శర్మ, మేజర్‌ అనూజ్‌ సూద్‌, జవాన్లు రాజేశ్‌, దినేశ్‌, ఎస్‌ఐ ఖ్వాజీ  ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆపరేషన్‌ ఎక్కడి వరకు వచ్చిందన్న విషయాన్ని తెలుసుకోవడానికి సైనికాధికారులు అశుతోష్‌ శర్మకు కాల్‌ చేయగా స్పందన లేదు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు మరో బృందాన్ని ఛాంగిముల్లా గ్రామానికి తరలించారు. అక్కడి చేరుకున్న ఈ బృందం ఆపరేషన్‌లో పాల్గొన్న ఐదుగురు మరణించారని గుర్తించింది. అలాగేఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టింది.